- సభలో అందరికీ షేక్‌హ్యాండ్ ఇచ్చిన ఆకట్టుకున్న సీఎం
- వర్షం పడుతున్నా భారీగా తరలి వచ్చిన ప్రజలు
మహబూబ్‌నగర్, వెలుగు : ‘నేను ఏం ఇచ్చినా.. నా ప్రాణం ఇచ్చిన మిడ్జిల్ మండలానికి తక్కువే. నిధులు ఇవ్వడం పెద్ద విషయం కాదు. ఈ మండలం, ఈ జిల్లా, రాష్ట్రంలో ప్రపంచంలో మన గళం వినిపించాం. ఆనాడు మీరు నాటి మొక్కనే ఈనాడు పెద్దదై బాధ్యత నిర్వహిస్తుంది. ఈ బాధ్యత కొనసాగడానికి నిండు మనసుతో ఆశీర్వదించండి’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మిడ్జిల్ మండల జడ్పీటీసీగా ఆయన విజయం సాధించి 20 ఏండ్లు పూర్తైన సందర్భంగా శనివారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో ‘కృతజ్ఞత సభ’ నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. సభలో సీఎం మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు, ఎస్. జైపాల్ రెడ్డి, పుట్టపాగ మహేంద్రనాథ్ వంటి గొప్ప నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో, నాడు 2006 జులై 4న మిడ్జిల్ ప్రజలు తనను జడ్పీటీసీగా గెలిపించి ఈ స్థాయికి చేర్చారని గుర్తుచేసుకున్నారు. 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రబ్బానీని జడ్పీ చైర్మన్ చేయాలనే లక్ష్యంతో ఈ మండలం నుంచి పోటీకి దింపారన్నారు.
కానీ తాను అతడిపై జడ్పీటీసీగా గెలిచానని, ఈ గెలుపు తనది కాదని అప్పటి ఉమ్మడి మిడ్జిల్ మండల ప్రజలదని గుర్తుచేశారు. ఆనాడు రబ్బానీ గెలిచుంటే ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్పీ చైర్మన్ అయ్యే వారని, తన వల్ల ఎవరికైనా ఎంతో కొంత సాయం చేయాలని, అందుకే ఆనాడు ఓడిపోయిన రబ్బానీకి ఇప్పుడు ప్రభుత్వంలో మంచి బాధ్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ మల్లు రవికి సూచించారు.
ఒకప్పుడు డార్క్ మండలంగా ఉన్న మిడ్జిల్‌ను జిల్లాకే ఆదర్శంగా నిలిపేందుకు, ఈ మండలాన్ని దత్తత తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆయన కోరారు. అంతుకుముందు సీఎం నేరుగా వేదికపైకి వెళ్లకుండా ప్రజల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తూ మహిళలు, యువకులకు షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు.
ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్రలు, మల్కాజ్‌గిరి ఎంపీగా గెలుపు, పీసీసీ అధ్యక్షుడిగా నియామకం, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం వంటి కీలక ఘట్టాలను చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా, సభ జరుగుతున్న సమయంలో వర్షం కురుస్తున్నప్పటికీ, సీఎం పర్యటనకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు కార్యక్రమం ముగిసే వరకు సభలోనే కూర్చోవడం విశేషం.
ప్రజల కలలు నెరవేరబోతున్నాయి..
సభలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదల, పోరాట పటిమతోనే 20 ఏండ్ల కింద జడ్పీటీసీగా మొదలైన తన రాజకీయ ప్రస్థానాన్ని సీఎం స్థాయికి చేర్చారన్నారు. ఒకప్పుడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరు జిల్లా ప్రజల కలలు ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో నెరవేరబోతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి యువతకు ఆదర్శంగా నిలిచారని, రాష్ట్రానికి పట్టిన పీడను తొలగించేందుకు ఆయన శ్రమిస్తున్నారని తెలిపారు.
ఇటీవల జడ్చర్ల పర్యటనలో హరీశ్ రావు సీఎంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన ప్రజలు అలసత్వం వహిస్తే పాలన మళ్లీ దొరల చేతికి వెళ్తుందని హెచ్చరించారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్‌గా ఎన్నో పోరాటాలు చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసే శక్తి గల నాయకుడని ప్రశంసించారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గ పర్యటనల ద్వారా నిరంతరం నిధులు కేటాయిస్తూ అండగా నిలుస్తున్నారని గుర్తుచేశారు.
ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద ఉమ్మడి మిడ్జిల్ మండలానికి రూ. 20 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో చెక్ డ్యాములు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో జడ్చర్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ఇందులో భాగంగా ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, భవిష్యత్‌లో జడ్చర్లకు మెట్రో రైలు కూడా తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
అంజన్నసేవలో సీఎం రేవంత్ రెడ్డి
నాగర్‌కర్నూల్ వెలుగు : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని తన ఇష్టదైవమైన అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ. 10 కోట్లతో చేపట్టనున్న ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో హెలికాప్టర్ పర్యటన రద్దయినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలిసి రోడ్డుమార్గంలో ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ హేమంత్ కేశవపాటిల్, ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా సీఎం చూశారు.
ఆత్మీయులతో సమావేశం..
2006లో తాను మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసిన సమయంలో తనకు అండగా నిలిచిన ఆత్మీయులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 45 టేబుళ్ల వద్ద కూర్చున్న సుమారు 315 మంది పాత మిత్రులను, కార్యకర్తలను సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలిశారు. ప్రతీ టేబుల్ వద్దకు వెళ్తూ అక్కడ ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు, ఆత్మీయులను పేరుపేరునా పిలుస్తూ వారి కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారితో కాసేపు ముచ్చటించి, జ్ఞాపకంగా ఫొటోలు దిగడం సభలో హాజరైన వారిని ఎంతగానో ఆకట్టుకుంది.
